, 2017-12-16, Saturday
language : தமிழ்
Breaking News
  •   

ఆస్కార్‌ అవార్డు గ్రహీత, సౌండ్‌ ఇంజినీరు రసూల్‌ పూకుట్టి తొలిసారిగా నటిస్తున్న చిత్రం ‘ఒరు కథ సొల్లట్టుమా’. పామ్‌స్టోన్‌ మల్టీమీడియా బ్యానరుపై ఈ చిత్రం నిర్మితమవుతోంది. త్రిసూర్‌లో జరిగే ఓ ఆలయ ఉత్సవం ఆధారంగా ఈ కథను తెరకెక్కిస్తున్నారు. రాహుల్‌రాజ్‌ సంగీతం సమకూర్చుతున్నారు. మలయాళం, తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోంది. ఇందులోనూ సౌండ్‌ ఇంజినీరుగానే నటిస్తున్నారు రసూల్‌. ఆడియో విడుదల కార్యక్రమం చెన్నైలో ఇటీవల ఘనంగా జరిగింది. ప్రసిద్ధ దర్శకుడు శంకర్‌, సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహ్మాన్‌, ఇతర సినీ ప్రముఖులు వైరముత్తు, శరత్‌కుమార్‌, రాధిక తదితరులు పాల్గొన్నారు. ఏఆర్‌ రెహ్మాన్‌ పాటలను ఆవిష్కరించి శంకర్‌కు తొలి సీడీని అందజేశారు. టీజర్‌ను వైరముత్తు విడుదల చేశారు. ఈ సందర్భంగా శంకర్‌ మాట్లాడుతూ... ‘‘ త్రిసూర్‌లో ఏటా ఎంతో వైభవంగా జరిగే ఓ ఉత్సవం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నామని రసూల్‌ చెప్పారు. ఆ వేడుకలో దాదాపు రెండు లక్షల మంది పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ విషయం ముందే తెలిసుంటే నా సినిమాలో తప్పకుండా ఆ సన్నివేశాలను పెట్టేవాడిని. తిరువయ్యారులో ఎంతో వైభవంగా జరిగే త్యాగరాయ ఉత్సవాలను ‘అన్నియన్‌’ (అపరిచితుడు) చిత్రంలో ప్రస్తావించా.

 నిజానికి ఆ ఉత్సవాలను ప్రత్యక్షంగా తెరకెక్కించాలని అనుకున్నా. అనుమతి లభించలేదు. తమ ప్రాంతంలో జరిగే వేడుకలను ప్రత్యక్షంగా తెరకెక్కించే అవకాశాన్ని సొంతం చేసుకుని... ఎన్నో శ్రమలకోర్చి డాక్యుమెంట్‌ ఫిక్షన్‌ చిత్రాన్ని రూపొందిస్తున్నారు రసూల్‌. ఆయన అద్భుతమైన శ్రమజీవి. అన్ని శబ్దాలను స్టూడియోలోనే క్రియేట్‌ చేయకుండా... ఆయా ప్రాంతాలకు వెళ్లి వాటిని తీసుకొస్తారు. ఆయన మరో స్థాయికి ఎదుగుతున్నారు. వైరముత్తు రాసిన పాటలను విన్నా. చాలా ఇంపుగా ఉన్నాయి. చిత్రయూనిట్‌కు అభినందనల’’ని పేర్కొన్నారు. అనంతరం ఏఆర్‌ రెహ్మాన్‌ ప్రసంగిస్తూ... రసూల్‌ను ఈ స్థాయిలో చూడటం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. వైరముత్తు మాట్లాడుతూ... ‘‘ ఏఆర్‌ రెహ్మాన్‌, శంకర్‌, అమితాబ్‌బచ్చన్‌, రజనీకాంత్‌ వంటి వ్యక్తులు దేశ సినీకళకు నిదర్శనంగా నిలుస్తున్నారు. ఆ జాబితాలోని మరో వ్యక్తి రసూల్‌ పూకుట్టి. ఆయన తన ప్రతిభతో ఈ స్థాయికి చేరారు. ఏ పురస్కారమైనా సరే.. అది మన జీవితానికి ఆరంభమనే అనుకోవాలి. అలా ఆస్కార్‌ అవార్డుతో ఆగిపోకుండా.. తన సంస్కృతి, సంప్రదాయాలు, వూరు, అక్కడి ఉత్సవాన్ని ఆరాధిస్తూ ఓ సినిమాను రూపొందిస్తుండటం అభినందనీయమ’’ని పేర్కొన్నారు.

Videos